Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. మధ్యలోనే తినేసి, ఎముకలు తెచ్చిచ్చిన డెలివరీ బాయ్!

Man orders chicken wings gets bones and a note instead
  • ఆకలికావడంతో తిన్నానని.. జాబ్ వదిలేస్తున్నానని డెలివరీ బాయ్ నోట్
  • తన కోసం డబ్బు చెల్లించాను అనుకోవాలంటూ విజ్ఞప్తి
  • ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారిన వీడియో.. జోకులపై జోకులు వేస్తున్న నెటిజన్లు
ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఒక్కోసారి మనకు నచ్చినట్టుగా ఫుడ్ వస్తుంది. కొన్నిసార్లు ఆహారం బాగుండదు. రుచిలో తేడా ఉంటుంది. ఇలాంటివి అప్పుడప్పుడూ ఎదురవుతూనే ఉంటాయి. ఇక కొన్ని సార్లు ఫుడ్ పడిపోవడం, తెచ్చిన ప్యాకింగ్ కవర్ లోకి కారిపోవడం వంటివీ జరుగుతుంటాయి. కానీ ఓ వ్యక్తికి మాత్రం అస్సలు ఏమాత్రం ఊహించని అనుభవం ఎదురైంది. తనకు వచ్చిన ఫుడ్ ఆర్డర్ ప్యాక్ ను ఓపెన్ చేసి చూసి ఆ వ్యక్తి అవాక్కయ్యాడు. దీనికి సంబంధించి డామియెన్ సాండర్స్ అనే వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.

క్షమించండి.. ఆకలేసి తినేశాను..

డామియెన్ ఇటీవల ఓ రెస్టారెంట్ నుంచి ఫ్రైడ్ చికెన్, ఓ కూల్ డ్రింక్ ను ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ కాస్త లేటుగా ఫుడ్ ను తెచ్చి ఇచ్చాడు. ప్యాకెట్ ను లోపలికి తీసుకెళ్లిన డామియెన్.. చికెన్ తిందామని ఆబగా ఓపెన్ చేసి చూసి  షాకయ్యాడు. అందులో ఫ్రైడ్ చికెన్ కు బదులుగా.. మొత్తం చికెన్ తినేసి, మిగిలిన ఎముకలు మాత్రమే ఉన్నాయి. దానితోపాటు ఓ లెటర్ కూడా రాసి పెట్టి ఉంది. 

‘‘నన్ను క్షమించండి. ఈ ఫుడ్ నేను తినేశాను. నాకు బాగా ఆకలిగా ఉంది. నా కోసం మీరు పే చేశారని అనుకోండి. ఈ దరిద్రపు గొట్టు జాబ్ ను నేను వదిలేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలి.. ఇట్లు మీ డెలివరీ బాయ్” అని ఆ లెటర్ పై ఉంది. డామియెన్ దీనంతటినీ వీడియో తీసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. వైరల్ గా మారింది. కొందరమో దీనిపై జోకులు వేస్తుంటే.. మరికొందరు డెలివరీ బాయ్ తీరును తిట్టిపోస్తున్నారు.

మరికొందరేమో ‘ఆకలేసి తినేసి ఉంటాడులే.. అతడిని క్షమించండి’ అని అంటుంటే.. ‘ఎంత ఆకలేసి తింటే మాత్రం.. తినేసిన ఎముకలను ప్యాకేజీలో పెట్టి ఇస్తాడా?’ అని ఇంకొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక డెలివరీ బాయ్ చికెన్ తినేసినా.. డ్రింక్ ను మాత్రం అలాగే తెచ్చి ఇచ్చాడు. దీనిపైనా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘ఇంకా నయం ఆ డ్రింక్ అయినా తెచ్చాడు. అదీ తాగేసి, ఖాళీ బాటిల్ పెట్టలేదు..’ అని పేర్కొంటున్నారు.
Online orders
Food
Food orders
Offbeat
Instagram

More Telugu News